ఫిఫా వరల్డ్ కప్‌లో పెను దుమారం.. మెస్సీపై జాతి వివక్ష సైగ చేసిన ఈజిప్ట్ కోచ్.. వీడియో వైరల్!

  • ఫిఫా వరల్డ్ కప్ 2026 మ్యాచ్‌లో అర్జెంటీనాతో ఈజిప్ట్ ఓటమి
  • మ్యాచ్ సందర్భంగా లియోనెల్ మెస్సీపై ఈజిప్ట్ కోచ్ జాత్యహంకార సైగ
  • ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
  • మెస్సీని టోర్నీలో ఉంచేందుకే ఇదంతా చేశారని ఈజిప్ట్ కోచ్ ఆరోపణ
  • రిఫరీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నాయని కోచ్ హోసమ్ హసన్ ఆగ్రహం
ఫిఫా వరల్డ్ కప్ 2026లో అర్జెంటీనా, ఈజిప్ట్ మధ్య జరిగిన మ్యాచ్ పెను వివాదానికి దారితీసింది. ఆఖరి నిమిషాల్లో అద్భుతమైన పునరాగమనంతో అర్జెంటీనా 3-2 తేడాతో విజయం సాధించినప్పటికీ, మ్యాచ్ ఫలితాన్ని రిఫరీ నిర్ణయాలు తీవ్రంగా ప్రభావితం చేశాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఈజిప్ట్ హెడ్ కోచ్ హోసమ్ హసన్, అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీపై చేసిన ఓ సైగ ఇప్పుడు క్రీడా ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

మ్యాచ్ సందర్భంగా మెస్సీ, హసన్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో మెస్సీ ఏదో అనడంతో దానికి ప్రతిగా హసన్ తన చేతులతో 'ఎక్స్‌' ఆకారంలో సైగ చేశారు. ఫిఫా నిబంధనల ప్రకారం జాత్యహంకార వ్యాఖ్యలను లేదా దుర్భాషను సూచించడానికి ఈ సైగను ఉపయోగిస్తారు. 

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మెస్సీపై జాత్యహంకార ఆరోపణల దుమారం రేగింది. అయితే, ఆ వీడియోలో ఆడియో లేకపోవడంతో మెస్సీ అసలేం అన్నాడనే దానిపై స్పష్టత లేదు. ఒకవేళ మెస్సీ అనుచిత వ్యాఖ్యలు చేసి ఉంటే, ఈజిప్ట్ కోచ్ ఫిఫాకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. విచారణలో దోషిగా తేలితే మెస్సీపై సస్పెన్షన్ వేటు పడే ప్రమాదం కూడా ఉంది.

నిర్ణయాలపై కోచ్ ఆగ్రహం
మ్యాచ్ అనంతరం ఈజిప్ట్ కోచ్ హోసమ్ హసన్ రిఫరీ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు కీలక నిర్ణయాలు తమ ఓటమికి కారణమయ్యాయని ఆరోపించారు. ఈజిప్ట్ ఆటగాడు మోస్తఫా జికో కొట్టిన గోల్‌ను వీఏఆర్ సమీక్షలో ఫౌల్ కారణంగా రద్దు చేయడం, ఆ తర్వాత తమకు రావాల్సిన స్పష్టమైన పెనాల్టీని నిరాకరించడం వంటివి వివాదాస్పదంగా మారాయి.

"ఈ రోజు జరిగింది ఏమాత్రం న్యాయం కాదు. మేము 3-1 ఆధిక్యంలో ఉండాల్సింది, కానీ స్కోరు 2-2గా మారింది. బహుశా ఇదంతా మార్కెటింగ్ కోసం జరుగుతోందేమో. గత ప్రపంచకప్ విజేతను, మెస్సీని టోర్నీలో కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నారనిపిస్తోంది" అని హసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఆరోపణలతో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా విజయం వివాదంలో చిక్కుకుంది.

Lionel Messi
Hossam Hassan
Argentina vs Egypt
FIFA World Cup 2026
Messi racism controversy
Football viral video

More Telugu News